Saturday 8 March 2014

నువ్వు రాక ముందు....! - ఫయాజ్ అహ్మద్ ఫయాజ్.





నీ రాకకు మునుపు ఏది ఎలా ఉండాలో అలానే ఉండేది;
అంతులేని ఆకాశం,సాగిపోయే రహదారి,మధుపాత్ర,మధుపాత్ర.

మరి ఇప్పుడు మధుపాత్ర,రహదారి,ఆకాశం అన్నీ వర్ణరంజితం,
ఖూనీ అయిన నా హ్రదయ రక్తవర్ణ శోభితం
తెరచిన నీ కనుల దహించే ద్వారాలు
మూసిన నీ కనుల ఊరట చీకటివర్ణాలు.

నీరాకతో గులాబీలలో పేలింది ఎరుపురంగు,
ఎండిపోయిన పూలతోట తగులబడుతున్న రంగు,
హాలహలపు రంగు,నెత్తుటి రంగు,నీలాకాశపు చిక్కటి నల్లరంగు.

ఆకాశం,రహదారి,మధుపాత్ర
ఒక తడిసిన కొంగు,నొప్పితో మూలిగే నరం,
క్షణ క్షణం మారిపోయే వాస్తవం.

ఇప్పుడు నా చెంతనున్నావు- ఉండు నాతో ఇలా,
ఒకే వర్ణం ఒకే కాలం ఉండేందుకలా
రహదారి రహదారిలా,
ఆకాశం ఆకాశంలా,
మధుపాత్ర కేవలం మధుపాత్రలాగా!