Friday 31 May 2013

నీ మౌనం ........... by Pablo Neruda.



అసలున్నావో ,లేవో అనిపించే
నీ మౌనం నాకిష్టం.

సుదూరంగా నేను నీకు వినవస్తా ,
కాని, నా గొంతు నిను తాకలేదు.
నీ కనులు నిను వీడి పోయినట్లున్నయి
గాలిలో తేలుతూ,
ఒక చుంబన ప్రక్రియ మాదిరి
నీ అధరాలు మూతపడిపోయినాయి.

ఈ వస్తు సంచయమంతా
నా ఆత్మారూపమే,
అందుకే నువ్వు వాటినుంచి
నా ఆత్మ నింపుకుని నా వద్దకొస్తావు ,
నువ్వు నా ఆత్మ లాగ  అగుపిస్తావు ,
నువ్వొక సీతాకోకచిలుక స్వప్నం
ఒక విషాదవాక్యం.

నువ్వెక్కడో సుదూరంగా ఉన్నట్లుండే
నీ మౌనం, నాకిష్టం.
నువ్వొక సుఖపు మూలుగు
నువ్వొక సీతాకోకచిలుక రవరవం .
సుదూరంలో నేను వినపడుతా,
నా గొంతు నిను చేరదు,
నన్ను శాంతపరచు , అపుడు
నీ నిశ్శబ్దంలో నేను  శాంతిస్తాను,
నన్ను మాట్లాడనివ్వు , అపుడు
నీ మౌనం తో నేను సంభాషిస్తాను!

కాంతి లాగా  దివ్యంగా ,
వ్రత్తం లాగా  సంపూర్ణంగా,
నువ్వొక చిక్కటి రాత్రివి,
శాంతి తో నిండిన నక్షత్రాకాశానివి !
ప్రియా ! నీ మౌనం నక్షత్రాల మాదిరి
సుదూరంగా..  కానీ , సుస్పష్టంగా
అసలు నీ ఉనికే లేని నీ మౌనం నాకిష్టం
సుదూరంగా .. విచారంగా
నువ్వు చనిపోయినావనిపించే నీ మౌనం !!

ఒక్క మాటైనా చాలు,  అప్పుడు
ఒక్క చిరునవ్వు చాలు .......
నా రోమాంచిత ఉత్ఖంటత, నా నిరీక్షణ
అంతా  ఒక భ్రమ !!
  





ప్రియా! ఈ రేయి మన హ్రదయాల్ని పెనవేయి ....... by Pablo Neruda.

ప్రియా, ఈ రేయి 
మన హ్రదయాల్ని పెనవేయి,
తడి తడి గా అలముకున్న 
చిక్కటి అరణ్య పత్రాల అడ్డుగోడలపై 
జంట హ్రదయాల యుద్ధ నగారా మ్రోగిద్దాం !!

నేల పొరలు చీల్చి తీసిన 
నల్లటి చల్లటి నిప్పు రాళ్ళ బోగీలు లాగే 
గూడ్సు బోగీ  నీడల క్రమచలనపు 
పిచ్చి ప్రయాణమీ జీవితం !!

అందుకే, ప్రియా!
నీ  హ్రదయ సరోవరంలో మునకలేసి 
రెక్కల్లల్లారుచుతున్న  నా 
హ్రదయవిహంగపు రెక్కలకు 
నీ హ్రదయదారాలను పెనవేసేయ్ !!

నీలాకాశపు తారికా ప్రశ్నలకు ,
నీడలు కదిలే ఇంటికున్న 
ఏకైక ద్వారపు ఏకైక తాళంచెవితో 
తిరుగులేని జవాబునిద్దాం !!

Thursday 30 May 2013

పోకిరి -- by Pablo Neruda.


నా  కనులు నను విడచి వెళ్లి పోయాయ్ ,
నా ప్రక్క నడచి వెళ్ళిన ఒక నల్ల పిల్ల వెంట పడి.

తేనె రంగు నల్ల ద్రాక్షలు నలిపి చేసిన
నల్ల ముత్యాల రాశి ఆమె !
అగ్ని వాలము తో  ఆమె కొట్టిన దెబ్బకు
నేను రక్తమోడాను !

ఇలాంటన్నింటి వెంటా నేను పడుతుంటాను !

శ్వేతవర్ణ స్త్రీ ఒకతి, తన సువర్ణ కేశాలనే
కిరిటంగా మార్చి బంగారు కాంతులను
ప్రదర్శిస్తూ వెళ్ళింది నా ప్రక్కగా.
నా నోరు అలలు అలలు గా  సాగి
ఆమె ఎదపై
నెత్తురు పిడుగులు కురిపించింది !

ఇలాంటన్నింటి వెంటా నేను పడుతుంటాను !

కాని నువ్వు నా ప్రక్కన లేకున్నా ,
సుదూరంగా ఉన్నా, కనుల ముందు లేకున్నా,
నా నెత్తురు , ముద్దులూ  నీకే !
నా నల్ల ముత్యమా  , నా స్వర్ణ సుందరీ
నా బొద్దు పిల్ల , నా మెరుపుతీగా
నా అనాకారీ , నా సుందరీ
నువ్వొక బంగారు రాశి
వెండి  కుప్ప, గోధుమ రాశి
ఈ నేలా ఇంకా సముద్రపు ఉప్పునీరు కలిపి
నిన్నుతయారు  చేసిందే
నా కౌగిలికై , నా ముద్దులకై
ఇంకా,  నా ఆత్మ కోసమై !!



Wednesday 29 May 2013

నువ్వే నా రాణివి ! -- by Pablo Neruda.



నువ్వే నా  రాణీవి. 

నీ కన్నా పొడవైన స్త్రీలున్నారు, పొడవరులు
నీ కన్నా స్వచ్ఛమైన స్త్రీలున్నారు, స్వచ్ఛంగా
నీ కన్నా ముద్దుగుమ్మలున్నారు , ముద్దుముద్దుగా

కాని నువ్వే నా రాణివి !

పురవీధుల్లో  నీ నడక సాగుతుండగా ,
నిన్నెవ్వరూ గుర్తించరు,
నీ వజ్రఖచిత కిరీటాన్ని కనలేరు , నీ నడక సాగే
ఎర్రటి బంగారు రంగు తివాచీని సైతం
ఎవరూ చూడలేరు. 

అది మాయా తివాచీ !

నిను చూసిన క్షణం
నా దేహంలో నదుల గలగల ,  ఉదరంలో
ఆకాశంలో  కంపనం
ఈ ప్రపంచమే ఒక పద్యం !

కేవలం నువ్వు - నేను
కేవలం నువ్వు - నేను మాత్రమే
దానిని వినగలం !!









Tuesday 28 May 2013

మృత్యుగీతం......... by Pablo Neruda


అవి,ఒంటరి శ్మశానాలు,
నిశ్శబ్ద ఎముకల సమాధులు,
బొరియలు త్రవ్వుకునే హ్రదయాలు,
అంధకార బంధుర బిలాలు;
మనసు కుహురం లోకి శిధిలమైపోయి
మనం చస్తాం.
మన హ్రదయసంద్రం లో మనమే 
మునిగి ఊపిరాడక చచ్చ్హిపోతాం! 
దేహం నుంచి ఆత్మ లోకి 
బీటలువారి నాశనమైపోతాం!

అవి,కళేబరాలు,
జిగటవారిన పాదాలు,
ఎముకల్లొ మరణం 
శ్రావ్యంగా మ్రోగుతోంది,
వానలోనో చావులోనో 
తేమకి ఉబ్బిన క్రొన్ని 
సమాధుల గంటలు 
అద్రశ్య భైరవుడిలా మొరుగుతున్నాయ్!

ఒకసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూశాను,
తలక్రిందులుగా ప్రవహించే 
నదీ ముఖద్వార పయనానికై,
పాలిపోయిన స్త్రీల మృతదేహపు
కురులజడలల్లి,నిశ్శబ్ద మృత్యుఘోషతో
ఉబ్బిన తెర చాపలెత్తి
ఎదురీదే శవపేటికలు,
పొయ్యి వద్ద పొగచూరే 
శ్వేత వర్ణ దేవతా స్త్రీలు,
పనికిరాని గుమాస్తాను పెళ్ళాడే
ప్రఙ్ఞావంతురాళ్ళైన మహిళలు.

మృత్యు ఘంటికలు మ్రోగుతున్నాయ్
కాళ్ళులేని చెప్పులు నడుస్తున్నాయ్ 
దేహం లేని చొక్కాలు కదులుతున్నాయ్ 
ఉంగరమూ లేదు,దానికి రాయి లేదు 
కాని,తలుపు తట్టిన ధ్వని,
నోరూ లేదు ,నాలుకా లేదు,గొంతూ లేదు 
కాని, ఏవో కేకలు,
ఆ అడుగుల చప్పుడు,దుస్తుల రెప రెప 
చెట్టు కొమ్మల్లో కదిలే గాలి సవ్వడి.....

నాదంతా వెఱ్ఱి 
నాకేమీ తెలీదు 
నా చూపు కూడా అంతంతే 
కానీ,నాక్కనిపిస్తోంది 
అది, బాగా తడిసి వెలిసి 
చివికిన ఊదా రంగు వస్త్రం 
ఆ కన్నుల్లో చూపు 
ముదురాకుపచ్చ మెరుపు 
అది, చెలరేగిపోయిన శీతాకాలపు 
ప్రతీకారంలో తడిసి చివికిపొయిన 
ఊదా రంగు పండుటాకు!

చివరికీ నేలను సైతం వదల్లా 
చీపురు లాగ నలుచెరుగులు 
ఊడ్చిపారేస్తొంది,
ఆ చీపురు మృత్యువే - 
మృత్యుదేవత నాలిక 
దారాన్ని వెతుక్కునే 
మృత్యుసూది.

మృత్యువు పండేది మన ప్రక్కలోనే 
బద్ధకపు పరుపుల్లో,మాసిన దుప్పట్లలో 
బాగా ఊరి,భళ్ళుమని పగులుతుంది,
అద్రశ్య శబ్దాలతో దుప్పటి నిండిపోతుంది.
మృత్యుశయ్యలు తేలుతూ 
చేరుతున్నాయ్ ఒడ్డుకు,
అక్కడ వారి రాక కోసమే
సర్వసైన్యాధ్యక్షుడి వేషంలో   
ఎదురు చూస్తోంది మృత్యుదేవత!!    

నీవు నన్ను మరచిపోతే..... by Pablo Neruda.


ఒక విషయం 
నీకు తెలపాలి: 

మెరిసే చంద్రుడు,
వసంత కాలపు
కొమ్మల కెంపు

చలిమంట వద్ద చెదరని
బూడిద నునుపు,
తగులబడిపోయి  
తాకితే చెదరిపోయే
ముడుతలువారిన మొద్దు 
ఇవన్నీ నీ దరికే నన్ను చేరుస్తాయి,   
సువాసనలు, కాంతులు, లోహాలు 
నాకై ఎదురుచూసే నీ ద్వీపానికి 
నను చేర్చే చినచిన్న నావలు.  

సరే,విను 

నాపై నీ ప్రేమను  
కొంచెం కొంచెంగా తగ్గిస్తే
నీ పై నా ప్రేమ 
కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది.

అనుకోకుండా 
నీవు నన్ను మరిస్తే 
ఎదురుచూడకు 
ఆ సరికే నేను నిన్ను
మరిచిపోయుంటాను

నా జీవిత విజయ కేతనపు 
రెపరెపలు నీకు 
పిచ్చిగా విసుగు తెప్పిస్తే  
నీలొ వ్రేళ్ళూనుకున్న 
నా హ్రదయ తీరాన 
నను వీడి పోవాలని 
నిర్ణయించుకుంటే 
గుర్తుంచుకో,

అదేరోజు,అదేక్షణం 
నా హ్రదయ విహంగం 
రెక్కలు చాచి 
వేరే తీరానికై  
ఎగిరిపోతుంది 

కాని,
ప్రతిరోజు,ప్రతిక్షణం 
ఓపలేని మాధుర్యం తో 
నీవు నా కొరకై పుట్టావని 
నీవు తలిస్తే,
ప్రతిరోజు 
ఒక పుష్పం నీ అధరాలపై 
నా కొరకై చేరితే,
ఆహా! నా ప్రేమా,నా స్వంతం  
నాలో ఆ ప్రేమాగ్ని మళ్ళీ ప్రజ్వరిల్లుతుంది,
నాలో ఏదీ ఆరిపోలెదు,
మరచీపోలేదు, 
ప్రియా!
నా ప్రేమను పోషించేది నీ ప్రేమే  
ఈ జీవితమంతా అది నీ చేతుల్లోనే 
ఉంటుంది,
నీవు నా చేతిని విడువంతవరకు !!      

ప్రేమ ----- by Pablo Neruda.


అసలు నీ బాధేమిటి? మనతో, 
మనమేమైపోతున్నాం అసలు ?
ఆహా! మన ప్రేమతంత్రే
మనల్ని చుట్టిపారేస్తోంది
గట్టిగా, గాయమయ్యేవరకు.
ఈ గాయాన్ని తప్పించుకుందామనుకుంటే, 
వదిలించుకుందామనుకునేలోపే
మరోక్రొత్త ముడిని బిగించి 
సర్వనాశనం చేసేస్తోంది,
రక్తం తోడేస్తోంది,
జంటగానే తగలబెట్టేస్తోంది.

నీకేమైంది అసలు? నీ వైపు
చూసే నాకు మరేవి కానరావు 
నీ జంట నయనాలు తప్ప,
నేను చూసిన 
ఎన్నో నయనాలలొ నీవీ ఒకటి,నీ నోరూ 
అంతే,నేను ముద్దాడి వదిలేసిన 
వేల నోళ్ళలో ఒకటి,చాలా అందమైన 
నీ శరీరం,జ్ఞాపకాలేమీ మిగల్చకుండానే 
నా క్రింద నుంచి జారిపోయిన ఎన్నో 
శరీరాలలో ఒకటి !

ఈ లోకం నీకెంత శూన్యం
జేగురు రంగు జాడి లాగా 
గాలీ లేక,ధ్వనీ లేక
పదార్ధ శూన్యమై!!
నా నిరాశా హస్తాలు,నీలో 
లోతును వెతికాయి,
అగాధం;నీ దేహం 
నీ కనులు శూన్యం.
కానీ,
నీ పలుచటి గుండెల క్రింద
ప్రవహిస్తోంది ఒక 
స్ఫటికప్రవాహ గానం!
ఎందుకు?ఎందుకు?ఎందుకు?
ఓ ప్రియా! ఎందుకు?   

ఈ రాత్రి నేను వ్రాస్తున్నానీ విషాద వాక్యాలు... . by Pablo Neruda.

ఈ రాత్రి నేను వ్రాస్తున్నానీ విషాద వాక్యాలు... 

వ్రాస్తున్నా,ఉదాహరణకి,
సుదూరంగా మిణుకుమంటున్నాయి నీలపు నక్షత్రాలు,
రాతిరి గాలి ఆకాశం లో తిరిగి పాడుతోంది.

ఈ రాత్రి నేను వ్రాస్తున్నానీ విషాద వాక్యాలు,
నేనామెను ప్రేమించాను,
ఆమె కూడా నన్ను  ప్రేమించింది కొన్నిసార్లు.

ఇలాంటి రాత్రుళ్ళలో నేనామెను నా బాహువులలొ పొదవుకున్నాను,
అంతులేని ఆకాశం క్రింద మళ్ళీ మళ్ళీ చుంబించాను.
ఆమె నన్ను వలచింది,నేను కూడా వలచాను కొన్నిసార్లు.

ఆమె గొప్ప అచంచలమైన నేత్రాలు చూసాకా ఎవరైనా
ఎలా ఉండగలరు ప్రేమించకుండా ..

ఆమె నా వద్ద లేదనే ఆలొచనతో ,
ఆమెను కోల్పోయాననే అనుభూతితొ,
ఈ రాత్రి నేను వ్రాస్తున్నానీ విషాద వాక్యాలు.

చిక్కటి రాత్రి గానం వింటున్నా,
ఆమె విరహంలో ఇంకా  చిమ్మచీకటైపోయింది.
ఇప్పుడీ పద్యాలు ఆత్మపై వర్షిస్తున్నాయి,
పసరిక పై పడే మంచు మాదిరి.

ఎందుకని నా ప్రేమ ఆమెను నిలుపుకోలేకపోయింది,
ఈ నక్షత్రాకాశపు రాత్రి ఆమె నా ప్రక్కన లేదు.

అంతే ఇంక ,
సుదూరంలో ఎవరిదో గానం,సుదూరంలో,
ఆమెను పోగొట్టుకున్న నా ఆత్మకు సంతృప్తి లేదు .

నా దరికి ఆమెను చేర్చాటనికన్నట్లు
నా చూపులామెను వెతుకుతూనె ఉన్నాయి.
నా హ్రదయం కూడ ఆమెను వెతుకుతొంది,
మరి ఆమె నా వద్ద లేదు.

అదే రాత్రి,అవే వృక్షాలను మంచుతో కప్పేస్తోంది,
అదే సమయంలో మేమిద్దరమూ మాకు లేము.

ఇపుడామెను నేను ప్రేమించటంలేదు,అది నిశ్చయం.
కానీ ఎంతగా ప్రేమించాను,
ఆమెకు వినిపించటనికై నా గొంతు తహతహలాడుతోంది.

వేరొకరిది,ఆమె వేరొకరిదైపోతుంది,
నా చుంబనాలందుకొవటానికన్నా పూర్వం లాగ.
ఆమె గొంతు,ఆమె కాంతులీనే శరీరం,
ఆమె అగాధమైన నయనాలు,అన్నీ.

నేనామెను ప్రేమించట్లేదు అది నిశ్చయం,
కానీ ప్రేమిస్తానేమో,
ప్రేమ క్షణికం,విరహం ఇంకా భారం.

ఎందుకంటే ఇలాంటి రాత్రుళ్ళంతా నేనామెను
నా కౌగిలి లో పొదవుకున్నాను
ఆమెను కోల్పోఇన నా ఆత్మకు శాంతి లేదు.

ఆమె నన్ను పెట్టగల
ఆఖరి బాధ ఇదే ఐనా సరే,
ఆమె కొరకు నేను వ్రాసే
ఆఖరి వాక్యాలివే !!