Thursday 27 June 2013

తాగుబోతుల నడుమ మత్స్యకన్య గాథ.... by Pablo Neruda.

ఆ మగాళ్ళంతా అక్కడే ఉన్నారు లోపల,
ఆమె పూర్తి నగ్నంగా లోనికి వచ్చినపుడు.
వాళ్ళందరూ తాగుతున్నారు:  అందరూ కాండ్రించి ఉమ్ములు  ఊసారు !
ఆమె ఇప్పుడే నది నుంచి వచ్చింది, ఆమెకేమి తెలియదు.
ఆమె ఒక దారితప్పిన మత్స్యకన్యక,
ఆమె మెరిసే మాంసం మీద హేళనలు కురుస్తున్నాయ్ !
అసభ్యాలతో ఆమె బంగారు వక్షాలు కుంచించుకుపోయాయ్,
కన్నీటిని ఆమె ఎరుగదు, ఆమె కన్నీరు పెట్టుకోలేదు,
వస్త్రాలను ఆమె ఎరుగదు , ఆమె వస్త్రాలు ధరించలేదు.
తగులబడిన బిరడాలతో, నుసిమేసిన సిగరెట్ పీకలతో,
ఆమెకు నల్లరంగు వేసేసారు !
తెగ నవ్వుతూ మద్యశాల నేలపై పొర్లించారు.
ఆమె ఏమీ మాటాడలేదు, ఆమెకు మాటలు రావు.
ఆమె కనులు, సుదూర ప్రేమ వర్ణాలు,
ఆమె బాహువులు, శ్వేత పుష్యరాగాలు,
మరకత కాంతుల్లో ఆమె పెదవులు నిశ్సబ్దంగా కదిలాయి,
హఠాత్తుగా ఆమె, గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోయింది,
నదిలోకి ప్రవేశించి శుభ్రపడిoది,
వర్షంలో పాలరాయిలా మెరిసింది,
వెనక్కు చూడకుండా మరల మరల ఈతలేసింది,
శూన్యం లోనికి  ఈదింది, మరణం లోనికి ఈదింది !!



  

Tuesday 25 June 2013

సముద్రపు ఒడ్డున ముసలిఅవ్వ -- by Pablo Neruda.



ముంగి సముద్రం వద్దకు వచ్చారు ముదుసలి స్త్రీలు
మెడలకు చుట్టుకున్న వారి శాలువాలతో,
బీటలువారిన పలుచని పాదాలతో...

ఒంటరిగా కూర్చుని ఉంటారు, తీరంలో
కనులు కదపరు చేతులు మెదపరు
మేఘాలనూ కదల్చరు మౌనాన్నీవిడువరు.

నీచపు సముద్రం భళ్ళున దూకుతుంది
మహిష గంగడోలు ఊగిస్తూ ఉరుకుతుంది
గర్జిస్తూ పంజాలు విసురుతుంది.

ఒద్దిక ముసలిపడతులు కూర్చునే ఉంటారు,
గాజు  పడవలో ప్రయాణికులు
ఉగ్రవాద అలలను చూస్తున్నట్లుగా.

వాళ్ళెక్కడికి పోతారు? వాళ్ళెక్కడనుంచి వచ్చారు ?
ప్రతి మలుపు నుంచి వారు వస్తారు
మన స్వంత జీవితాలనుంచే వారు వస్తారు.

ఇప్పుడు వారికి మిగిలింది సముద్రo.
శీతలంగా కాల్చేస్తున్న శూన్యత్వం,
భగ భగ మండే ఒంటరితనం !

ప్రతి గతం నుంచి వారు వస్తారు,
ముక్కలైపోయిన ఇళ్ళలోనుంచి,
బూడిదైపోయిన సాయంత్రాలనుంచి.

వాళ్ళు  చూస్తే చూస్తారు, లేదా చూడరు సముద్రాన్ని
వాళ్ళ చేతికర్రలతో ఇసుకలో ఏవో గుర్తులు గీస్తారు
సముద్రం వారి చక్కని దస్తూరిని తుడిచేస్తుంది.

ముదుసలి స్త్రీలు లేచి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
వారి నాజూకు పక్షి పాదాలతో.
గాలిలో ఎగురుతూ  అలలు
నగ్నంగా నర్తిస్తూనే ఉంటాయి !!






Saturday 22 June 2013

నువ్వు లేని నేను.... by Pablo Neruda.

బహుశా,
నువ్వు లేని నేను
నేను నేను కాను.
నువ్వు రాని పొద్దు
వేకువ వేటుకు తెగి
చీకటి పుష్పం విరియదు!

అటుపై,
పొగమంచు శిలలపై
నీ నడకలు సాగకున్నా,
నీ ఎత్తిన చేతి కాగడా
సువర్ణజ్వాలల కాంతులు
వేరెవరూ నమ్మలేకున్నా,
ఆ రోజా పూల కాంతుల
జన్మరహస్యం మాత్రం
నీ ఉనికిని చాటుతుంది!

చివరకు నువ్వున్నా లేకున్నా
నీ ఉనికి; నీ రాక ;
హఠాత్తుగా, ఉత్తేజంగా
నాకు, నా జీవితరహస్యాన్ని
తెలుపుతుంది. 
రోజా చెట్ల వెలుగులు
గాలుల్లో గోధుమలు
నను వెంటాడేది 'నీ వలనే' !
'నీ వలనే' నను వెంటాడేది;
అదే నేను; అదే మనము;
అదే ఈ ఉనికికి కారణం,
కేవలం...  ఆ ప్రేమ !  
నీకైనా...  నాకైనా...   మనకైనా...


Friday 21 June 2013

కోరిక............ by Pavankumar Jain.


నాకో కోరిక ఉంది,
ఈ జీవితాన్ని ఇక ముగించేయాలని,
కాని ఇవాళ కాదు,
అంతగా చెప్పుకోదగ్గ రోజు,
కాదు ఈ రోజు.

పైగా ,
ఇంకా రెండు గాజుబుడ్లున్నాయి,
నేను శుభ్రం చేయాల్సినివి,
క్షురకుడి వద్దకు వెళ్ళాలి,
కాటరాక్టు ఆపరేషను కూడా అయింది,
మొక్కలకు నీళ్ళు పోయాలి,
(ఇప్పుడు అవి పూసే సమయం)
పైగా చూసుకోవాలిసిన చిన్నచెల్లెలు కూడా ఉంది,
వాడికోసం నేనింకా కలలు కంటూనేఉన్నా,
కోట్ల ఆస్తి నాకు రాసిపారేసే అపరిచితుడి కోసం.

ఇప్పటికైతే అందులో పెట్టేస్తా
ఈ చావుగోలను,
నా చీకిపోయిన నల్లసంచీలో,
దాన్నిండా బొక్కలే,
దాన్ని మేకుకి తగిలిస్తా,
ఆ గోడకి వేలాడేస్తా.

నిజం చెప్పాలంటే,
నేనొక సన్యాసినైపోవాలనుంది,
కాని చాలా సంవత్సరాలు పట్టేటట్టుoది,
ఒక దారిలో పడాలంటే,
నా చుట్టూ ఉన్న ఈ చికాకులన్నీ.

ఎబ్బెట్టుగా కూడా ఉంది,
గోచీ పెట్టుకుని బయట తిరగాలంటే,
ముష్టి కోసం అడుక్కుంటూ,

అదొకటి,
ఇంకా మహాతల్లులున్నారు,
వాళ్ళ పిల్లల్ని భయపెట్టటానికని,
మనల్ని చూపిoచి:
అడుగో బూచాడు అంటారు.
అంత తేలిక కాదు ఇవన్నీ
అలవాటవ్వాలంటే,
అసలు సరైనపని ఏమిటంటే, దీన్నికూడా
చీకిపోయిన నా నల్లసంచీలో వేసేయటమే,
వాడొచ్చి మిమ్మల్నే పట్టుకుంటాడు !!



Thursday 20 June 2013

నీ పాదాలు ...... by Pablo Neruda.


నేను నీ ముఖారవిందాన్ని చూడనప్పుడు
నీ పాదాల వైపు చూస్తాను.
నీ వంపువెముకల మండప పాదాలు ,
నీ చిట్టి, గట్టి పాదాలు.
నాకు తెలుసు, అవి నిన్ను నిలబెడతాయి,
వాటి మీదుగానే నీ తీయనిభారం
ఉదయిస్తుంది.
నీ నడుము, నీ వక్షాలు
నీ చూచుక ముదురు ధూమ్రవర్ణo.
ఇప్పుడే అలా గాలిలో తేలుతూ వెళ్ళిపోయిన
నీ కనుపాపలు,
విశాల ఫల అధరాలు,
నీ కెంపు జడలు.
కానీ, నా చిట్టి  గోపురమా,
నేను నీ పాదాలనే ప్రేమిస్తాను,
కేవలం ఒకే ఒక కారణానికి : అవి
భూమి పై నడిచాయి ,
గాలి పై నడిచాయి,
నీటి పై నడిచాయి,
నన్ను వెతికి పట్టుకునేవరకు ........



Wednesday 19 June 2013

ఈ సంధ్య ..........by Pablo Neruda.


ఈ సంధ్య కూడా మన చేజారిపోయింది.
నీలపు చీకట్లు లోకాన్ని కమ్ముతున్న
 ఈ సాయం సమయం లో
చేతిలో చేయి కలిపిన మన జంట
ఎవరికంటా పడలేదు!

నేను చూసాను, నా గవాక్షం గుండా
సుదూర పర్వత శ్రంగాల పై
సూర్య అస్తమ ఉత్సవం!
ఆ సూర్యబింబo
కాలుతున్ననాణెంలా
నా అరచేతిన మండుతుంది,
కొన్నిసార్లు!
నీకూ తెలుసు, విరహంలో
నీ జ్ఞాపకం
నా ఆత్మను పిండుతుంది,
కొన్నిసార్లు!

ఎక్కడున్నావ్ అప్పుడు నువ్వు?
అక్కడ ఇంకెవరున్నారు?
ఏమంటున్నారు?
ఎందుకని  ఇంత ప్రేమ హఠాత్తుగా
నామీద ఊడిపడుతుంది, నువు
దూరమైపోయావని నేను దిగులు పడే క్షణాలలో?

ఈ సంధ్యలో మూసిన పుస్తకమొకటి
చేజారిపడింది, నా పాదాల వద్ద
నా  నీలపు స్వెట్టర్ ఒకటి
గాయపడిన కుక్క మాదిరి
ఉండచుట్టుకు పడుంది.

ప్రతిసారి ! ప్రతీసారీ ! ఆ సాయంసమయాలలో..
శిలావిగ్రహాలను సైతం చెరిపేసే సంధ్యలలోకలసిపోయి,
నువ్వు దూరమైపోతూనే ఉంటావు !!!












 



Monday 17 June 2013

కుమ్మరి ..........by Pablo Neruda.

నీ నిండు దేహపు నిండుదనమో ,
నాజూకుదనమో  రాసిపెట్టున్నదే
 నాకోసం !

నీ దేహాన్ని తడిమిన ప్రతిచోట
నా చేతుల్లో ఒదిగేనొక గువ్వ!
అవి మెత్తిన నీ మట్టి దేహం,
తయారైందే
నా కుమ్మరి చేతుల కోసం !

నీ మోకాళ్ళు , నీ వక్షాలు, నీ నడుము -
నాలో మాయమై నీలో వెలిసిన
నా దేహభాగాలు,
తాపాలు రగిలే
పుడమి బొరియల్లో
మాయమైన
మట్టి రూపాలు !
కనుక, జంటగా మనమిద్దరం,
ఒక నిండు నదిలా..ఒక మట్టి రేణువులా..
సంపూర్ణం !!

Friday 14 June 2013

మన ప్రేమ............ by Pablo Neruda.



మన లాంటి ప్రేమికులు  ఉన్నారా, అసలు ఎప్పుడైనా?
పద, యుగాల పూర్వమే  కాలిబూడిదైన 
ఆ హ్రదయాన్ని వెదకి, దానికి  
ముద్దు మీద ముద్దు పెడుతూనే ఉందాం,
ఎన్నడో అంతరించిపోయిన ఆ ప్రేమ పుష్పం 
మళ్ళీ వికసించేవరకూ!!
  
 తన ప్రేమ ఫలాన్ని తానే తిని, 
దాని రూపాన్నీ, శక్తినీ సంతరించుకుని
 దివి నుంచి భువికి జారిన 
అపర ప్రేమ లాగా 
మనం ప్రేమించుకుందాం !
కొనసాగుతున్న ఆ అమృత ఫలం యొక్క 
మృదువైన మెరుపు తళుకే నువ్వు,నేను !

హిమసమాధైన వసంతాలనూ ,విస్మృత శిశిరాలనూ 
దాచుకున్న అనాది సుషుప్తావస్థను వదిలించే 
కొత్త గాయాన్ని రేపుదాం, 
ఆ ఆపిల్ ను కొరుకుదాం !
దాని రుచిచూసి ,మౌనంగా 
కాలగర్భంలో సమాధైన అధరాలకు 
కొత్త వారసులవుదాం !!

 



Thursday 13 June 2013

నీ చేతులు ........... by Pablo Neruda.


నా కోసం నీ చేతులు ఎగిరినపుడు,ప్రియా!
ఆ ఊపు లో నాకోసం అవి తెచ్చేది  ఏమిటో?
నా అధరాలను తాకి హఠాత్తుగా
అవి ఎందుకు ఆగుతాయి,
ఎందుకని నాకు,నీ కరస్పర్శ  చిరపరిచితమని అనిపిస్తుంది?
అవి నా పాలభాగాన్నినిమిరాయి, నా పొట్టను తాకాయనే భావన ఎందుకని?
అసలంటూ, నేనింకా పుట్టక మునుపే ....

ఆ నాజుకూదనం, యుగాల గుండా ,సాగరాలు దాటి,
పొగమంచులో నుంచి వసంతo మీదుగా విహరిస్తూ
వచ్చివాటిలో చేరింది!
 ఆ సువర్ణ కపోత రెక్కలస్పర్శ, నాకు తెలుసు,
నీ చేతులు నా హ్రదయంపై వాలినపుడు !
ఆ మట్టి రంగు నాకు తెలుసు.

నా జీవితకాలమంతా వెతుకులాటే,
 అగోచర మార్గాలు,
ఎక్కిదిగే మెట్లు ఎగిరి దాటే  లోయలు.
రైళ్ళు నన్ను విసిరిపారేసాయి, సముద్రం అక్కున చేర్చుకుంది.
చివరకు, ద్రాక్షాపండ్లను తాకి చూశాను నీ స్పర్శను!
హఠాత్తుగా అరణ్యం నీ ఉనికిని తెలిపింది,
బాదంచెట్టు తన ఆకులలో నిను దాచింది,
నీ గమ్యాన్ని చేరేవరకూ
 నీ రెక్కలు
ముడిచి నా గుండెలపై వాలేవరకూ!


















Wednesday 12 June 2013

నిన్ను నేను ప్రేమిస్తాను.......by Pablo Neruda.

అగ్గిలో రేగే నిప్పురవ్వల మాలికవనో
ఉప్పు చల్లిన రోజా పుష్పానివనో, లేదా
అరుదైన పుష్యరాగానివనో
నిన్ను నేను ప్రేమించను!
ఆత్మకు, నీడకు నడుమన  దాగిన కొన్ని
అనివార్య నిగూఢ విషయాల మాదిరి, రహస్యంగా
నిన్ను నేను ప్రేమిస్తాను!

నిన్ను నేను ప్రేమిస్తాను,
ఎన్నటికీ పుష్పించలేనని తెలిసికూడా
 పుష్పశోభల వెలుగులను రహస్యంగా తనలో మ్రోసే
 పూల మొక్కను, ప్రేమించినట్లుగా..
 నీ ప్రేమకు కృతజ్ఞతలు :
అనురాగ జల్లులలో తడిసిన  ధరిత్రి
 వెదజల్లే  ఘాటుపరిమళాలను
 నా హ్రదయంలో పుట్టించినందుకు!

 ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రేమించాలో కూడా తెలియదు, కాని
నిన్ను నేను ప్రేమిస్తా !
అహంకారమో  గందరగోళమో  లేకుండా సూటిగా
నిన్ను నేను ప్రేమిస్తా !
అది అంతే, ఎందుకంటే మరో దారి తెలియదు నాకు.

ఇప్పుడింక నువ్వూ లేవు, నేను లేను,దూరమూ లేదు.
ఎంత దగ్గరో.. నా గుండెల మీద వేసిన నీ చేయి...  నా చేయే,
ఎంత దగ్గరో.. నా నిద్రలో మూతలు పడే కన్నులు .... నీవే!!












Tuesday 11 June 2013

నిన్ను ప్రేమించే చోటు...... by Pablo Neruda.



అది, నేను నిన్ను ప్రేమించేచోటు.
 దట్టమైన అరణ్యంలో స్వేచ్ఛాపవనాలు వీచే చోటు,
కల్లోల అలలపై చంద్రుడు భాస్వరంలా వెలిగే చోటు,
రోజును తరుముతూ రోజు, రోజులు మారని కాలం.

నృత్యభంగిమల హిమం కురుస్తోంది.
సుదూర... సుదూర.. తారాలోకాన విహరించే
 సముద్రకాకి ఒకటి, పడమటి దిక్కున జారింది.

ఆహా... నల్లటి శిలువ !  ఆ ఓడ పైన, ఒంటరిగా.
కొన్నిసార్లు త్వరగా నిద్రలేపే తెల్లవారు తేమ  
నిండుతుంది నా ఆత్మ లో సైతం !
సుదూరంగా.. సముద్రం ధ్వనిస్తుంది,ప్రతిధ్వనిస్తుంది.
అది ఒక రేవు.
నేను నిన్ను ప్రేమించేచోటు!

అది, నేను నిన్ను ప్రేమించే చోటు.
 దిక్కులు కలిసే చోట నిన్ను దాచేస్తుంది ఓర్వలేని  ప్రకృతి .
అయినాసరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
కొన్నిసార్లు నా ముద్దులను మోసుకుపోతాయి
ఎప్పటికి తిరిగిరాని ఆ భారీ సాగరనౌకలు!

నాకు నేనొక తుప్పుపట్టిన లంగరులా కనిపిస్తా.
తీరాన్ని తాకిన మధ్యాహ్నాలను చూసి రేవు చిన్నబోతుంది.
తీరని ఆకలితో నా జీవితం అలిసిపోతుంది.
నా వద్ద లేని దాన్ని నేను ప్రేమిస్తాను. నువ్వు సుదూరంగా ఉన్నావు.

నెమ్మదిగా వాలే సంధ్యలతో నా మూర్ఖత్వం పెనుగులాడుతుంది,
కాని రాతిరి వస్తుంది. నా కొరకే  గానం చేస్తుంది.
వెన్నెల్లో నా స్వప్నాలు నృత్యం చేస్తాయి !!

పెద్ద పెద్ద నక్షత్రాలు నీ కళ్ళతో నన్ను చూస్తాయి,
నేను నీ ప్రేమలో ఉండగా, మానులపై
 అల్లుకున్న తీగల్లో ఊగే పవనం,
నీ నామసంకీర్తనం చేయ ప్రయత్నిస్తుంది !!
 
















 


Monday 10 June 2013

ప్రియతమా ! ................ by Pablo Neruda.

ప్రియా !
నీ చిరునగవు, వసంతకాలపు
శీతల శిలలపై రేగే అలల నురుగు,
ప్రియతమా !

ప్రియా !
నాజూకు బాహువులు,లేత పాదాలతో
నీ హొయలు,
శ్వేతాశ్వపు కూనల నడకల జాలు!
నా కంటికి  నీ రూపం
ఒక లోకోత్తర పుష్పం !
ప్రియతమా!

ప్రియా!
  గజిబిజి రాగి తీగల గూడునీ  శిరోభూషణం,
నా హ్రదయజ్వలన శయన కారణ భారమధువర్ణశోభితం!
ప్రియతమా!

ప్రియా!
నీ నయనాలు నీ వదనం కన్నా విశాలం,
నీ నయనాలు ఈ ధరిత్రి కన్నా విశాలం.
నీ కనులలో సామ్రాజ్యాలు, నదులు.
నా దేశం కొలువైన నీ కనులు,
వాటి వెలుగుల్లోనే నా నడకలు!
ప్రియతమా !

ప్రియా!
  బీడు భూమిని, సువర్ణ చంద్రుడిని
కలిపి  చేసిన రెండు బన్నుముక్కలు,
నీ వక్షాలు,
ప్రియతమా !

ప్రియా!
నీలో సాగే అనాది నదీ ప్రవాహ గమనాన్ని
నా చేతులు తీర్చిన ఒంపు, నీ జఘనం !
ప్రియతమా!

ప్రియా!
నీవి  సాటిలేని ఊరువులు,
 బహుశా,ఎక్కడైనా ఈ భూమి
 తన రహస్య స్థలాలలో దాచిందేమో
నీ ఒంపులు, పరిమళాలు,
 బహుశా, ఎక్కడైనా!
ప్రియతమా!

ప్రియా! నా ప్రియతమా !
నీ స్వరం,నీ త్వచం,నీ నక్షాలు,
ప్రియా! నా ప్రియతమా !
నీ ఉనికి,నీ వెలుగు,నీ ఛాయ,
అన్నీ నా కోసం! ప్రియతమా!
అన్నీ నా కోసమే ప్రియా !
నువ్వు నడుస్తున్నా, అలిసి ఆగినా,
నువ్వు గానం చేస్తున్నా, గాఢనిద్రలో ఉన్నా,
నువ్వు క్షోభిస్తున్నా, స్వప్నిస్తున్నా,
ఏంచేస్తున్నా సరే,
నువ్వు సమీపంలో ఉన్నా, సుదూరంగా ఉన్నా,
ఎక్కడున్నా సరే,
నువ్వు నా దానివే ప్రియతమా!
ఎన్నాళ్ళైనా సరే !!
















Saturday 8 June 2013

మధ్యాహ్నవేళల్లో ......... by Pablo Neruda.


 మధ్యాహ్నవేళల్లో....నేను వెన్ను వంచి,   
 నీ సాగరనయనాలపై
 నా నిరాశావలలు విసురుతాను !

 మిట్టమధ్యాహ్నం పూట అనంత జలధిలో        మునిగిపోతూలేపిన చేతుల మాదిరి,
 పెనవేసుకున్న ప్రేమాగ్ని జ్వాలలు
 నాలో పైపైకి రేగుతాయి!

 దీపస్తంభ వెలుగుల్లో, అలలఫై 
తేలే అరుణవర్ణ కాంతుల  హెచ్చరికలు,
నీ పరధ్యాన నయనాలపై నే ప్రసరిస్తా!

అంధకారంలో కొన్నిసార్లు,
 నా సుదూరసుందరి ! నువ్వు,
దారితప్పి గుబులు పుట్టే 
దిగులుతీరాలు తాకుతావు ! 

మధ్యాహ్నవేళల్లో, నేను వెన్నువంచి 
నీ నయనాలలో మ్రోగే నిశీధి సాగరంపై ,
నా నిరాశావలలను విసురుతాను ! 

నీలాకాశంలో ప్రభవించిన తొలి చుక్కలను 
నిశీధిపక్షులు పొడుస్తున్నాయి,
ఆ నక్షత్రకాంతులు, నీ ప్రేమ చేసిన
నా ఆత్మగాయాల మాదిరి మెరుస్తున్నాయి! 

మసకల కుచ్చిళ్ళు పరుస్తూ,నిశీధి అశ్వం 
లోకంపైకి ఉరికింది !! 








Thursday 6 June 2013

చెలియ దేహం ...........by Pablo Neruda.



సఖీ ! నీ దేహంలో,
శ్వేతవర్ణ పర్వతాలు,శుక్లవర్ణ ఊరువులు.
నా కంటికి నువ్వొక దాన ధరిత్రి !
పుడమిని చీల్చుకు పుట్టే పుత్రుడి కోసం,
నా మొరటు రైతు దేహం నిన్ను దున్నిపారేస్తుంది !


పక్షులన్నీ ఎగిరిపోయి , అంధకారం అలముకున్న
నేను, ఒక ఒంటరి బిలం!
నా రక్షణ కై పోతపోసుకున్ననువ్వు,  నా  ఆయుధం  !
నా ఉండేలు లో రాయి , నా వింటి లో బాణం.


యుద్ధానికి సిద్ధం కావలిసిన తరుణం లో తరుణీ,
నీ ప్రేమలో పడ్డా !
పచ్చని పచ్చిక కప్పిన వెచ్చని పాలసంద్రం నీ దేహం.
ఆహా, నీ మధుకుంభ వక్షాలు ! ఆహా,నీ నిర్లక్ష్య నయనాలు !
ఆహా, నీ రహస్య గులాబీ వర్ణాలు ! ఆహా, నీ సుతిమెత్తని విషాద స్వరం !

నా చినదానా ! నీ దేహపు వైభవంలో చిక్కుకుపోయా,
అది తీరని దాహం, అంతులేని  ప్రతీకారం, ఒక పద్మవ్యూహం !
 నీరెండిన నల్లటి  నదీ తిన్నెల వెంబటి  వృధా ప్రయాస, అది
 ఒక అనంత దుఃఖం !!




 




Tuesday 4 June 2013

ప్రేమ .......... by Pablo Neruda


నీ కారణంగానే....
వసంత కాలపు ఉద్యానవన పరిమళాలు
నన్ను బాధిస్తాయి.
నీ నయనాలు జ్ఞాపకం లేవు ,
నీ చేతులను ఏనాడో మరచిపోయాను.
నీ అధరాలపై నా అధరాలు చేరిన వేళ
వాటి అనుభూతి ఏమిటో......

నీ కారణంగానే....
ఉద్యానవనంలో, కదలలేని మెదలలేని
పాలిపోయిన పాలరాతి విగ్రహాలపై కూడా
ప్రేమ పుట్టింది .
అవి వినలేవు కనలేవు !

నీ స్వరం నాకు గుర్తులేదు.నీ సుమధుర స్వరం.
నీ నయనాలూ......  జ్ఞాపకం లేవు !

సువాసనలు పుష్పాలను వీడి పోలేవు ,
నీ మసక జ్ఞాపకాలు కూడా నను వీడి పోవు. 

జ్ఞాపకాల గాయాల సలపరింతే నా జీవితం ,
నను తాకకు, కోలుకోలేని దెబ్బ తింటాను ! కానీ,
నా విషాద ప్రాకారాలపై అల్లుకునే నునులేత తీగ వంటి 
 నీ కోమల కరస్పర్శే నాకు ఓదార్పు !

నీ ప్రేమను నేను మరచిపోయాను, కాని
దోవలో నా కంట పడిన ప్రతి కిటికీలోనూ
ఒక క్షణకాలం నువ్వు మెరుస్తావు !

నీ కారణంగానే ,
వేసవి ఘాటుపరిమళాలు నన్ను క్షోభ పెడతాయి !
నీ కారణంగానే ,
 నా కోరికలను తీర్చే శకునాలను
 నేను మళ్ళీ వెతుకుతున్నాను  :
 హఠాత్తుగా రాలే  చుక్కలు,,,చేజారే  వస్తువులు...       
 


 

Sunday 2 June 2013

విరహం............ by Pablo Neruda.



నువ్వు చెదరిపోయావు నా విరహంలో.....
 నీది కష్టమో, దిగులో, భయమో ఏమైనా కాని,
నా హ్రదయంలో నీ స్థానం పదిలం.
ఇది నా హ్రదయభారమో, లేక
నీ పై అనురాగమో !

ప్రియా !
నిరంతరమూ నేనందించే
జీవనమాధుర్య బహుమానమందుకొని
ఓపలేని హాయితో మూతలుపడే నీ
నయనాల దాగున్న అనుభూతి కూడా అదే !

నా ప్రేమా! నీటితో తీరని దప్పికలో
మనం నెత్తురు త్రాగాం.
 ఆకలి తీరక రగిలిన
 కోరికల జ్వాలాగ్ని
కరచిన గాయాలమయ్యాం!

కానీ,
ఎదురుచూడు నా కోసం
నీ మాధుర్యం జర భద్రం,
వస్తూ వస్తూ నే తెస్తా
నీ కై ఒక రోజా పుష్పం!!


 




Saturday 1 June 2013

నీ నవ్వు చాలు ............ by Pablo Neruda.


నా నోటి కాడి కూడు లాగేసుకో, కావాలంటే
ఉపిరాడకుండా ఉసురు లాగేసుకో, కానీ
 నీ నవ్వు మాత్రం నాకొదిలేయ్ !

ఆ గులాబీని, ఆ కొరడా దెబ్బ రుచిని ,
భళ్ళుమని పగిలే ఆ నిండు సంతోషాన్ని,
నువ్వు మాత్రమే సృష్టించగల
ఆ వెండివెన్నెలని మాత్రం నాకొదిలేయ్ !

మార్పుని స్వాగతించలేని లోకంతో
పోరాడి కొన్నిసార్లు,
అలసిన కన్నులతో నే ఇంటికొస్తా ,
కాని, గుమ్మంలో ఎదురయే నీ చిరునవ్వు
ఆకాశమంతా నిండి నా క్రొత్త ఆశలకు
ద్వారాలు తెరుస్తుంది !

ప్రియా ! నా ఓటమిలో విషాదంలో
నీ నవ్వు నాకు కావాలి ,
హఠాత్తుగా పుర వీధులలో
నా నెత్తుటిమరకలు కనపడిన సరే .. ... నవ్వు !
ఎందుకంటే నీ నవ్వు నా కత్తికి
కొత్త పదును పెడుతుంది !!

రాతిరిని చూసి నవ్వు, పగటిని చూసి నవ్వు !
చందమామని, గజి బిజీ వీధుల ఈ ద్వీపాన్ని,
నువ్వంటే పడిచచ్చే ఈ తింగరి కుర్రాడిని చూసి..  నవ్వు !
కాని నే కనులు తెరచినా మూసినా ,
ముందుకెళ్ళినా, వెనక్కొచ్చినా
 ఆహారం , గాలీ,  వెలుతురూ ఏమీ అఖ్ఖర్లేదు,
 నీ నవ్వు చాలు......  ఎందుకంటే,
 అదంటే నే పడి చస్తా !!