Tuesday, 23 July 2013

నీ పోలికకై నా వేట... by Pablo Neruda.


వడి వడిగా పడిలేచే
సుడిగుండపు  స్త్రీనదిలో
సాగుతోంది నా వేట
ఒకటైనా పట్టకపోనా
నీ పోలిక ఇందరిలో !
వాలు జడలు, వాలే
నునుసిగ్గు నయనాలు,
అలల నురుగుల తేలే 
నాజూకు నడకలు !

హఠాత్తుగా పట్టానొక పోలిక
అచదరపు నీ నఖముల
అదురుపడే ఆ రూపు ఒక
చెర్రీ పండు చెల్లెళ్ళ చూపు!
అంతలో నను తాకి సాగాయి
అవిగో నీ కురులు, నే చూశా
బహుశా నీ రూపం,
నీటి అడుగున రగులుతున్న
ఒక భోగి మంట !!

ఎంతో వెతికా నేను
వేరెవరిలో లేవు నీ హొయలు,
నీ వెలుగు, వనాలనుంచి తెచ్చి
పరచిన నీ దివాఛాయ.
ఎవ్వరికి లేవు నీ చిట్టి చెవులు !

నువ్వొక పూర్ణం, నిక్కచ్చిగా నీలో
ప్రతిదీ ఒక సంపూర్ణం,
కనుక మరి నేను
నీ వెంటే తేలుతా ప్రేమలో
ఈ విశాల మిసిసిపీ నదిలా
నీతోనే సాగుతా
స్త్రీత్వసాగరంలో సంగమిస్తా !! 

 

 




Saturday, 6 July 2013

ఈ రేయి నీ ఊహే నాకు తోడు.....by Pablo Neruda.


ప్రియా! ఈ నడిరాత్రి నువ్వే నాకు తోడు,
ఆ ఊహే నాకు చాలు!
చిక్కుపడిన చికాకువలల
చిక్కుముడులు విప్పుకునే
ఈ నిశీధిపక్షి కి తోడుగా
నీ నిద్రన అద్రశ్యమై నా దరి చేరావు!

విరహంలో నీ విముక్త హ్రదయం
కలలలో తేలుతోంది,
నీ దేహం మాత్రం
సుదూరంలో శ్వాసిస్తోంది,
నిశీధిలో నిశ్శబ్దంలో
మొలకెత్తే,నా కలలు
తీర్చడానికై తనను తాను
తీర్చిదిద్దుకుంటోoది !

మెలకువలో నీ తీరు వేరు,
ఉదయంలో నీ  జీవితం వేరు,
కాని, వాస్తవానికి భ్రమకు మధ్యన
సరిహద్దులు చెరిపేసే
రాతిరి వేళల్లో.. మన సమాగమం!

ఇంకా ఏదో మిగులుంది,
జీవితవెలుగుల వైపు ఇరువురిని లాగుతోంది,
పెనవేసిన రహస్య జీవుల ఉనికిని
నీడలలో దాచేసే
ఆ జీవాగ్ని !!






Friday, 5 July 2013

నిమజ్జనం......... by Pablo Neruda.




నువ్వన్నింటినీ దిగమింగేస్తావు,
పెరిగే దూరం లాగా ,
సముద్రం లాగా, కాలం లాగా .
సమస్తం...  నీలో  నిమజ్జనం !
ఆ దౌర్జన్యం, ఆ ముద్దు, ఆ గంట, ఎంతో ఆనందం.
దీపస్తంభపు కాంతుల్లా జ్వలించిన ఆ గంట కాలం.
ఓడ సరంగు  ఉత్ఖంఠత,
అగాధాల దూకే గజ ఈతగాని ఉగ్రావేశo,
అల్లకల్లోలపు ప్రేమ మైకం,
సమస్తం...  నీలో నిమజ్జనం  !