Wednesday, 10 December 2014

ఈ లోకం ఒక వృక్షం ! by రూమీ (1207 – 1273)

నేస్తమా! ఈ లోకం ఒక వృక్షం ,
దాని కొమ్మకు వేలాడే పిందెలం మనం!

ఆ చెట్టు కొమ్మ పచ్చి కాయలనెందుకు గట్టిగా పట్టు?
అది, మనం జారిపడి బేజారవకుండా కాపాడే గుట్టు!

రంగు తిరిగి తీపెక్కిన ఫలాలను మాత్రం ,
తేలికగా వాటి  కాళ్ళ పైన వదిలేస్తుందీ సూత్రం !
-
-
-
-
అనువాదం: పెమ్మరాజు సత్య ప్రసాద్.
చిత్రం : విలియం అడాల్ఫ్ బోగారియా.
************&***********

Thursday, 4 December 2014

లే!... by రూమీ (1207 – 1273)


లే! నీ మోర వినగలిగే విశ్వాస వనాలు వీస్తున్నాయ్,
లే!  నెరవేరబోతున్నాయ్ నీ విన్నపాలు ! 

నీరస ఆత్మల నిరాశా లోకాన్ని వదిలేయ్, 
లే! నీకు జవాబివ్వటానికి  ప్రార్థనాద్వారాలు తెరచుకున్నాయ్ !
-
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్యప్రసాద్ 
చిత్రం : మొర్తెజా కటౌజియాన్.
*******&******* 

Saturday, 29 November 2014

చాటు మాటు చోటులో... by ఫారో ఫర్ఖద్ (1935 –1967).

నాకేదో పిచ్చి పట్టిందంటారు వాళ్ళు, 
నా ముద్దులు, కౌగిళ్ళు, 
 చవకబారంటాయి వాళ్ళ నోళ్ళు !
 నిజం ! తెంచుకుంటో మీ సంకెళ్ళు,
బిగుసుకున్న నా అధరాలు 
పోసుకున్నాయి మళ్ళీ ప్రాణాలు ! 
కట్టుబాట్లకిక చోటు లేదు నాలో 
కరిగిపోవాలి నేను, నీ బిగి కౌగిట్లో !
ఆ చాటు మాటు చోటులో చేరాలిక ఇరువురం,
నీ వెచ్చని తనువు, ఆ మధువు నాకొక వరం ! 
-
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్,
చిత్రం : నజ్మా షరీఫ్. 
******&****** 
In Persian:
گفته اند آن زن زنی دیوانه است
کز لبانش بوسه آسان می دهد
آری اما بوسه از لبهای تو
بر لبان مرده ام جان میدهد
هرگزم در سر نباشد فکر نام
این منم کاینسان ترا جویم به کام
خلوتی می خواهم و آغوش تو
خلوتی می خواهم و لبهای جام
.



Saturday, 22 November 2014

ఆ గొడ్డలెందుకు ప్రియా... by రూమి (1207 - 1273).

  
 ఒక చిన్న సాకు చాలు, నీ ప్రేమలో పడి  మునిగిపోయేందుకు 
ఒక ఊహ గుస గుస చాలు, నీ మత్తులో పడి ఊగిపోయేందుకు 
 ఆ గొడ్డలెందుకు ప్రియా నన్ను నరికిపారేయడానికి,
నీ మెరిసే కళ్ళ చురుకు చూపుకే , నేను ముక్కలైపోతాను !
-
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్యప్రసాద్ 
చిత్రం : ఇమాన్ మలేకి. 
******&*****


Tuesday, 18 November 2014

స్వీయ నియమాలు... by రూమి (1207 – 1273)



చేసే తప్పులన్నీ చేసేసి, తిరిగి నీ వద్దకొచ్చేస్తా బిర బిరా,
తిరిగి, నీ ఇంటి చుట్టుతా నే తిరుగుతా గిర గిరా !

ఆ శ్రార్ధపు ముంతలో కప్పెట్టిన నా స్వీయ నియమాలన్నీ,
తిరిగి నీ ముఖం చూడగానే, వాటి ఖర్మకవే కాలిపోయాయ్!
-
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్,
చిత్రం : అబ్బాస్ కటౌజియాన్ .
******&******





Friday, 14 November 2014

నిన్ను కలవాలనే ఆశ ! by రూమి (1207 – 1273).

పొగ రేగని నీ అగ్గిలో నే రగిలిపోయా,
ఆర్పలేని నీ అగ్నిలో కన్నీరై రాలిపోయా!
ఆ గాడిని తప్పమంటూ పదే పదే హ్రదయాన్ని బాదేశా,
కాని చెళ్ళుమంటో మోగింది ప్రతిసారి - నిన్ను కలవాలనే ఆశ !
-
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్,
చిత్రం : ఇమాన్ మలేకి.
*****&*****

Wednesday, 12 November 2014

ఆ ఇసుక కుప్పల వెనుక ! by రూమి (1207 – 1273).

నా హ్రదయం లోనికి, ప్రియతమా - నీకు మాత్రమే అనుమతి !
చెత్త చెదారం మట్టి మశానమే, ఇతరులకు దక్కే బహుమతి !
వారి ముఖారవిందం మెరిసే వెన్నెల - కావచ్చును గాక ,
నా కన్నులు పూడ్చేస్తాయి వారందరిని, ఆ ఇసుక కుప్పల వెనుక!
-
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్
చిత్రం : ఇమాన్ మలేకి

Monday, 3 November 2014

ప్రేమ పట్టు ! by రూమి (1207 – 1273)


తరచుగా నా నేస్తాలు చెప్పే సలహా ఇదే - 
నా ప్రేమే పట్టిస్తోందిట నన్ను పెడదారి,
మార్చుకోవాలంటారు నా దారి,  
నా జవాబు : "లేదు, లేదు వేరేదారి"

"ప్రేమనే పట్టుకోకుంటే , ప్రేమ పై నా పట్టు జారిపోతే -
 నిలువగలనా నేను? నేను, నేను జారి పడిపోను?"
-
-
-
-

అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్ 
చిత్రం : విలియం అడాల్ఫ్. 


Thursday, 30 October 2014

దుమ్ము - ధూళిని కాను... by రూమి (1207 – 1273)


నా ఇష్టానికి నేనీ తీరాన్ని దాటి  పోలేను,
నన్నిక్కడకు పంపిన వాడే , తిరిగి
నా దేశానికి నన్ను తీసుకుపోతాడు !

ఆకాశ పక్షిని నేను,
దుమ్ము - ధూళి కాదు, నా సేత,
క్షణ భంగుర జీవితానికి,
భూమిపై బందీనయ్యా నేను, నీ చేత !
-
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్,
చిత్రం : ఇమాన్ మలేకి.
********&********

Monday, 27 October 2014

నీ దెబ్బ కాచగలేను by రూమి (1207 – 1273).

నీ ప్రేమ నన్ను వెంటాడింది, నా సహనం నను వీడి పోయింది,
నా మేధ పడకేసింది, నా మనసును దొంగిలించావ్ !

నీకేం కావాలో దోచేసుకో, నీ దెబ్బ కాచగలేను,
పోగొట్టుకుంటున్న ఈ హ్రదయాన్ని మరెక్కడని దాచగలను?
-
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్,
చిత్రం : విలియం అడాల్ఫ్ బొగావురియ.
            *******&*******

Friday, 24 October 2014

ప్రేమ పదాలు ! .. by రూమి (1207 – 1273):


ప్రేమాగ్ని రగిలే పద్యాలెన్నెన్నో వ్రాశా ;
కాని  ప్రేమలో పడ్డాకా, 
వాటిఫై ఎంతో సిగ్గుపడ్డా !
పదాలు తట్టి లేపేది జ్ఞానం,
హ్రదయాలు తాకగలిగేది పద్యం,
కాని ప్రేమ, ఈ కళలన్నింటికీ అతీతం !
-
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్ 
చిత్రం : విలియం అడాల్ఫ్. 

Saturday, 18 October 2014

చూపు తిప్పుకోలేనంత ప్రేమ : Rumi (1207 – 1273)



పనంతా చక్కబెట్టి మూసేస్తి దుకాణం. 
కూనిరాగాల కవిత్వమే ఇక నా సేద్యం !

చూపు తిప్పుకోలేనంత ప్రేమ పుట్టింది నీ పైన,
నా జీవితం, హ్రదయం పిండి పోశా నీ లోన !
-
-
-
-
అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్,
చిత్రం : ఇమామ్ మలెకి. 
*******&********



Thursday, 16 October 2014

ఈ శీతల రాత్రి హస్తాలు - by ఫారో ఫర్క్ఖద్ (1935 - 1967)


నేనిక దేనినీ ప్రశ్నించను, ఊరికే షికార్లు కొడతా;
నాకు లేదొక గమ్యం, నాకు లేదొక లక్ష్యం !
ఒక అంధకార బిలం లోకి నా నిర్లక్ష్యపు ముద్దులు విసిరేస్తా;
ఒక ఆత్మంటు లేని ఈ ఖాళీ దేహానికి ఏ ప్రేమా గుర్తు లేదు !
నాలో అతను మరణించాడు, మరి నేను రెక్కలు తెగి పడ్డాను:
ఈ లోకం  నా మసక దృష్టికి ఇక  ఏ సంతోషమూ  పంచలేదు !
ఒంటరిగా ఒణుకుతున్న, ఈ శీతల రాత్రి హస్తాలు -
నా అసహనపు హ్రదయాన్ని బిగించేశాయి, చాలా తేలికగా ! 
-
-
-
- అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్ . 
చిత్రం : స్టీవెన్ కేన్నీ . 




Sunday, 12 October 2014

ఫారో ఫర్ఖద్ (1935-1967) : 'అపవిత్రం'


నన్నిలా వదిలేసెయ్, నేనొక మురికి కూపం. 
ఒక క్రూర హ్రదయం దాగుంది నా నకిలీ నవ్వు వెనుక!
 చంచలం, ప్రమాదం : నేనొక నిప్పు కణిక. 
అంతులేని కోరిక దురాశ నన్నావహించాయి !
నీ హ్రదయం పవిత్రం నా ఎద నిండా మరకలు. 
అపరిచితుల వెంట కూడా సిగ్గులేకుండా ఇష్టంగా వెళ్ళాను!
నా ముద్దు పెట్టిన చిచ్చుకి నీ హ్రదయానికి నిషా ఎక్కింది;
అగాదాంధకారాల మధు ప్రవాహాల తాగుబ్రోతును నేను ! 
-
-
-
-
అనువాదం : సత్యప్రసాద్ పెమ్మరాజు 
  చిత్రం : స్టీవెన్ కెన్నీ. 

Saturday, 8 March 2014

నువ్వు రాక ముందు....! - ఫయాజ్ అహ్మద్ ఫయాజ్.





నీ రాకకు మునుపు ఏది ఎలా ఉండాలో అలానే ఉండేది;
అంతులేని ఆకాశం,సాగిపోయే రహదారి,మధుపాత్ర,మధుపాత్ర.

మరి ఇప్పుడు మధుపాత్ర,రహదారి,ఆకాశం అన్నీ వర్ణరంజితం,
ఖూనీ అయిన నా హ్రదయ రక్తవర్ణ శోభితం
తెరచిన నీ కనుల దహించే ద్వారాలు
మూసిన నీ కనుల ఊరట చీకటివర్ణాలు.

నీరాకతో గులాబీలలో పేలింది ఎరుపురంగు,
ఎండిపోయిన పూలతోట తగులబడుతున్న రంగు,
హాలహలపు రంగు,నెత్తుటి రంగు,నీలాకాశపు చిక్కటి నల్లరంగు.

ఆకాశం,రహదారి,మధుపాత్ర
ఒక తడిసిన కొంగు,నొప్పితో మూలిగే నరం,
క్షణ క్షణం మారిపోయే వాస్తవం.

ఇప్పుడు నా చెంతనున్నావు- ఉండు నాతో ఇలా,
ఒకే వర్ణం ఒకే కాలం ఉండేందుకలా
రహదారి రహదారిలా,
ఆకాశం ఆకాశంలా,
మధుపాత్ర కేవలం మధుపాత్రలాగా!