Tuesday 28 May 2013

మృత్యుగీతం......... by Pablo Neruda


అవి,ఒంటరి శ్మశానాలు,
నిశ్శబ్ద ఎముకల సమాధులు,
బొరియలు త్రవ్వుకునే హ్రదయాలు,
అంధకార బంధుర బిలాలు;
మనసు కుహురం లోకి శిధిలమైపోయి
మనం చస్తాం.
మన హ్రదయసంద్రం లో మనమే 
మునిగి ఊపిరాడక చచ్చ్హిపోతాం! 
దేహం నుంచి ఆత్మ లోకి 
బీటలువారి నాశనమైపోతాం!

అవి,కళేబరాలు,
జిగటవారిన పాదాలు,
ఎముకల్లొ మరణం 
శ్రావ్యంగా మ్రోగుతోంది,
వానలోనో చావులోనో 
తేమకి ఉబ్బిన క్రొన్ని 
సమాధుల గంటలు 
అద్రశ్య భైరవుడిలా మొరుగుతున్నాయ్!

ఒకసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూశాను,
తలక్రిందులుగా ప్రవహించే 
నదీ ముఖద్వార పయనానికై,
పాలిపోయిన స్త్రీల మృతదేహపు
కురులజడలల్లి,నిశ్శబ్ద మృత్యుఘోషతో
ఉబ్బిన తెర చాపలెత్తి
ఎదురీదే శవపేటికలు,
పొయ్యి వద్ద పొగచూరే 
శ్వేత వర్ణ దేవతా స్త్రీలు,
పనికిరాని గుమాస్తాను పెళ్ళాడే
ప్రఙ్ఞావంతురాళ్ళైన మహిళలు.

మృత్యు ఘంటికలు మ్రోగుతున్నాయ్
కాళ్ళులేని చెప్పులు నడుస్తున్నాయ్ 
దేహం లేని చొక్కాలు కదులుతున్నాయ్ 
ఉంగరమూ లేదు,దానికి రాయి లేదు 
కాని,తలుపు తట్టిన ధ్వని,
నోరూ లేదు ,నాలుకా లేదు,గొంతూ లేదు 
కాని, ఏవో కేకలు,
ఆ అడుగుల చప్పుడు,దుస్తుల రెప రెప 
చెట్టు కొమ్మల్లో కదిలే గాలి సవ్వడి.....

నాదంతా వెఱ్ఱి 
నాకేమీ తెలీదు 
నా చూపు కూడా అంతంతే 
కానీ,నాక్కనిపిస్తోంది 
అది, బాగా తడిసి వెలిసి 
చివికిన ఊదా రంగు వస్త్రం 
ఆ కన్నుల్లో చూపు 
ముదురాకుపచ్చ మెరుపు 
అది, చెలరేగిపోయిన శీతాకాలపు 
ప్రతీకారంలో తడిసి చివికిపొయిన 
ఊదా రంగు పండుటాకు!

చివరికీ నేలను సైతం వదల్లా 
చీపురు లాగ నలుచెరుగులు 
ఊడ్చిపారేస్తొంది,
ఆ చీపురు మృత్యువే - 
మృత్యుదేవత నాలిక 
దారాన్ని వెతుక్కునే 
మృత్యుసూది.

మృత్యువు పండేది మన ప్రక్కలోనే 
బద్ధకపు పరుపుల్లో,మాసిన దుప్పట్లలో 
బాగా ఊరి,భళ్ళుమని పగులుతుంది,
అద్రశ్య శబ్దాలతో దుప్పటి నిండిపోతుంది.
మృత్యుశయ్యలు తేలుతూ 
చేరుతున్నాయ్ ఒడ్డుకు,
అక్కడ వారి రాక కోసమే
సర్వసైన్యాధ్యక్షుడి వేషంలో   
ఎదురు చూస్తోంది మృత్యుదేవత!!    

No comments:

Post a Comment