Monday 10 June 2013

ప్రియతమా ! ................ by Pablo Neruda.

ప్రియా !
నీ చిరునగవు, వసంతకాలపు
శీతల శిలలపై రేగే అలల నురుగు,
ప్రియతమా !

ప్రియా !
నాజూకు బాహువులు,లేత పాదాలతో
నీ హొయలు,
శ్వేతాశ్వపు కూనల నడకల జాలు!
నా కంటికి  నీ రూపం
ఒక లోకోత్తర పుష్పం !
ప్రియతమా!

ప్రియా!
  గజిబిజి రాగి తీగల గూడునీ  శిరోభూషణం,
నా హ్రదయజ్వలన శయన కారణ భారమధువర్ణశోభితం!
ప్రియతమా!

ప్రియా!
నీ నయనాలు నీ వదనం కన్నా విశాలం,
నీ నయనాలు ఈ ధరిత్రి కన్నా విశాలం.
నీ కనులలో సామ్రాజ్యాలు, నదులు.
నా దేశం కొలువైన నీ కనులు,
వాటి వెలుగుల్లోనే నా నడకలు!
ప్రియతమా !

ప్రియా!
  బీడు భూమిని, సువర్ణ చంద్రుడిని
కలిపి  చేసిన రెండు బన్నుముక్కలు,
నీ వక్షాలు,
ప్రియతమా !

ప్రియా!
నీలో సాగే అనాది నదీ ప్రవాహ గమనాన్ని
నా చేతులు తీర్చిన ఒంపు, నీ జఘనం !
ప్రియతమా!

ప్రియా!
నీవి  సాటిలేని ఊరువులు,
 బహుశా,ఎక్కడైనా ఈ భూమి
 తన రహస్య స్థలాలలో దాచిందేమో
నీ ఒంపులు, పరిమళాలు,
 బహుశా, ఎక్కడైనా!
ప్రియతమా!

ప్రియా! నా ప్రియతమా !
నీ స్వరం,నీ త్వచం,నీ నక్షాలు,
ప్రియా! నా ప్రియతమా !
నీ ఉనికి,నీ వెలుగు,నీ ఛాయ,
అన్నీ నా కోసం! ప్రియతమా!
అన్నీ నా కోసమే ప్రియా !
నువ్వు నడుస్తున్నా, అలిసి ఆగినా,
నువ్వు గానం చేస్తున్నా, గాఢనిద్రలో ఉన్నా,
నువ్వు క్షోభిస్తున్నా, స్వప్నిస్తున్నా,
ఏంచేస్తున్నా సరే,
నువ్వు సమీపంలో ఉన్నా, సుదూరంగా ఉన్నా,
ఎక్కడున్నా సరే,
నువ్వు నా దానివే ప్రియతమా!
ఎన్నాళ్ళైనా సరే !!
















No comments:

Post a Comment