
వసంత కాలపు ఉద్యానవన పరిమళాలు
నన్ను బాధిస్తాయి.
నీ నయనాలు జ్ఞాపకం లేవు ,
నీ చేతులను ఏనాడో మరచిపోయాను.
నీ అధరాలపై నా అధరాలు చేరిన వేళ
వాటి అనుభూతి ఏమిటో......
నీ కారణంగానే....
ఉద్యానవనంలో, కదలలేని మెదలలేని
పాలిపోయిన పాలరాతి విగ్రహాలపై కూడా
ప్రేమ పుట్టింది .
అవి వినలేవు కనలేవు !
నీ స్వరం నాకు గుర్తులేదు.నీ సుమధుర స్వరం.
నీ నయనాలూ...... జ్ఞాపకం లేవు !
సువాసనలు పుష్పాలను వీడి పోలేవు ,
నీ మసక జ్ఞాపకాలు కూడా నను వీడి పోవు.
జ్ఞాపకాల గాయాల సలపరింతే నా జీవితం ,
నను తాకకు, కోలుకోలేని దెబ్బ తింటాను ! కానీ,
నా విషాద ప్రాకారాలపై అల్లుకునే నునులేత తీగ వంటి
నీ కోమల కరస్పర్శే నాకు ఓదార్పు !
నీ ప్రేమను నేను మరచిపోయాను, కాని
దోవలో నా కంట పడిన ప్రతి కిటికీలోనూ
ఒక క్షణకాలం నువ్వు మెరుస్తావు !
నీ కారణంగానే ,
వేసవి ఘాటుపరిమళాలు నన్ను క్షోభ పెడతాయి !
నీ కారణంగానే ,
నా కోరికలను తీర్చే శకునాలను
నేను మళ్ళీ వెతుకుతున్నాను :
హఠాత్తుగా రాలే చుక్కలు,,,చేజారే వస్తువులు...
No comments:
Post a Comment