
సఖీ ! నీ దేహంలో,
శ్వేతవర్ణ పర్వతాలు,శుక్లవర్ణ ఊరువులు.
నా కంటికి నువ్వొక దాన ధరిత్రి !
పుడమిని చీల్చుకు పుట్టే పుత్రుడి కోసం,
నా మొరటు రైతు దేహం నిన్ను దున్నిపారేస్తుంది !
పక్షులన్నీ ఎగిరిపోయి , అంధకారం అలముకున్న
నేను, ఒక ఒంటరి బిలం!
నా రక్షణ కై పోతపోసుకున్ననువ్వు, నా ఆయుధం !
నా ఉండేలు లో రాయి , నా వింటి లో బాణం.
యుద్ధానికి సిద్ధం కావలిసిన తరుణం లో తరుణీ,
నీ ప్రేమలో పడ్డా !
పచ్చని పచ్చిక కప్పిన వెచ్చని పాలసంద్రం నీ దేహం.
ఆహా, నీ మధుకుంభ వక్షాలు ! ఆహా,నీ నిర్లక్ష్య నయనాలు !
ఆహా, నీ రహస్య గులాబీ వర్ణాలు ! ఆహా, నీ సుతిమెత్తని విషాద స్వరం !
నా చినదానా ! నీ దేహపు వైభవంలో చిక్కుకుపోయా,
అది తీరని దాహం, అంతులేని ప్రతీకారం, ఒక పద్మవ్యూహం !
నీరెండిన నల్లటి నదీ తిన్నెల వెంబటి వృధా ప్రయాస, అది
ఒక అనంత దుఃఖం !!
No comments:
Post a Comment