Tuesday 11 June 2013

నిన్ను ప్రేమించే చోటు...... by Pablo Neruda.



అది, నేను నిన్ను ప్రేమించేచోటు.
 దట్టమైన అరణ్యంలో స్వేచ్ఛాపవనాలు వీచే చోటు,
కల్లోల అలలపై చంద్రుడు భాస్వరంలా వెలిగే చోటు,
రోజును తరుముతూ రోజు, రోజులు మారని కాలం.

నృత్యభంగిమల హిమం కురుస్తోంది.
సుదూర... సుదూర.. తారాలోకాన విహరించే
 సముద్రకాకి ఒకటి, పడమటి దిక్కున జారింది.

ఆహా... నల్లటి శిలువ !  ఆ ఓడ పైన, ఒంటరిగా.
కొన్నిసార్లు త్వరగా నిద్రలేపే తెల్లవారు తేమ  
నిండుతుంది నా ఆత్మ లో సైతం !
సుదూరంగా.. సముద్రం ధ్వనిస్తుంది,ప్రతిధ్వనిస్తుంది.
అది ఒక రేవు.
నేను నిన్ను ప్రేమించేచోటు!

అది, నేను నిన్ను ప్రేమించే చోటు.
 దిక్కులు కలిసే చోట నిన్ను దాచేస్తుంది ఓర్వలేని  ప్రకృతి .
అయినాసరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
కొన్నిసార్లు నా ముద్దులను మోసుకుపోతాయి
ఎప్పటికి తిరిగిరాని ఆ భారీ సాగరనౌకలు!

నాకు నేనొక తుప్పుపట్టిన లంగరులా కనిపిస్తా.
తీరాన్ని తాకిన మధ్యాహ్నాలను చూసి రేవు చిన్నబోతుంది.
తీరని ఆకలితో నా జీవితం అలిసిపోతుంది.
నా వద్ద లేని దాన్ని నేను ప్రేమిస్తాను. నువ్వు సుదూరంగా ఉన్నావు.

నెమ్మదిగా వాలే సంధ్యలతో నా మూర్ఖత్వం పెనుగులాడుతుంది,
కాని రాతిరి వస్తుంది. నా కొరకే  గానం చేస్తుంది.
వెన్నెల్లో నా స్వప్నాలు నృత్యం చేస్తాయి !!

పెద్ద పెద్ద నక్షత్రాలు నీ కళ్ళతో నన్ను చూస్తాయి,
నేను నీ ప్రేమలో ఉండగా, మానులపై
 అల్లుకున్న తీగల్లో ఊగే పవనం,
నీ నామసంకీర్తనం చేయ ప్రయత్నిస్తుంది !!
 
















 


No comments:

Post a Comment