Saturday 1 June 2013

నీ నవ్వు చాలు ............ by Pablo Neruda.


నా నోటి కాడి కూడు లాగేసుకో, కావాలంటే
ఉపిరాడకుండా ఉసురు లాగేసుకో, కానీ
 నీ నవ్వు మాత్రం నాకొదిలేయ్ !

ఆ గులాబీని, ఆ కొరడా దెబ్బ రుచిని ,
భళ్ళుమని పగిలే ఆ నిండు సంతోషాన్ని,
నువ్వు మాత్రమే సృష్టించగల
ఆ వెండివెన్నెలని మాత్రం నాకొదిలేయ్ !

మార్పుని స్వాగతించలేని లోకంతో
పోరాడి కొన్నిసార్లు,
అలసిన కన్నులతో నే ఇంటికొస్తా ,
కాని, గుమ్మంలో ఎదురయే నీ చిరునవ్వు
ఆకాశమంతా నిండి నా క్రొత్త ఆశలకు
ద్వారాలు తెరుస్తుంది !

ప్రియా ! నా ఓటమిలో విషాదంలో
నీ నవ్వు నాకు కావాలి ,
హఠాత్తుగా పుర వీధులలో
నా నెత్తుటిమరకలు కనపడిన సరే .. ... నవ్వు !
ఎందుకంటే నీ నవ్వు నా కత్తికి
కొత్త పదును పెడుతుంది !!

రాతిరిని చూసి నవ్వు, పగటిని చూసి నవ్వు !
చందమామని, గజి బిజీ వీధుల ఈ ద్వీపాన్ని,
నువ్వంటే పడిచచ్చే ఈ తింగరి కుర్రాడిని చూసి..  నవ్వు !
కాని నే కనులు తెరచినా మూసినా ,
ముందుకెళ్ళినా, వెనక్కొచ్చినా
 ఆహారం , గాలీ,  వెలుతురూ ఏమీ అఖ్ఖర్లేదు,
 నీ నవ్వు చాలు......  ఎందుకంటే,
 అదంటే నే పడి చస్తా !!


2 comments: